Jump to content

అతిశా

వికీపీడియా నుండి
అతిశా దీపాంకర శ్రీజ్ఞాన
చైనీయ ఊహాచిత్రణలో అతిశా. టిబెట్‌లోని కదమ్ మఠం నుండి సేకరించబడిన ఈ వర్ణచిత్రపఠం, 1993లో న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌కు బహుమతిగా ఇవ్వబడింది. ఈ చిత్రంలో అతిశా, ఎడమ చేతితో తాళపత్ర రాత ప్రతిని పట్టుకొని, కుడి చేతితో బోధించే ముద్రలో ఉండటం కనిపిస్తుంది.[1]
జననంక్రీ.శ. 982
విక్రమ్‌పూర్‌ (విక్రమ్‌పూర్‌)
(now in మున్షిగంజ్, బంగ్లాదేశ్)
మరణంక్రీ.శ. 1054
నైతాంగ్, టిబెట్ (ప్రస్తుత చైనా)
జాతీయతభారతీయుడు (ప్రస్తుత బంగ్లాదేశ్)
వృత్తిబౌద్ధ భిక్షువు, పండితుడు, తంత్ర జ్ఞాని
ప్రసిద్ధిటిబెట్ లో బౌద్ధధర్మ పునరుజ్జీవకుడు.
ముఖ్యమైన సేవలుకదమ్/గెలుగ్ బౌద్ధమత శాఖ కు మూలపురుషుడు.
మతంబౌద్ధమతం
తల్లిదండ్రులుశ్రీ ప్రభావతీ (తల్లి), కళ్యాణశ్రీ (తండ్రి)
రచనలు: బోధిపథప్రదీప, విమలరత్నలేఖన, మహాయానపథసాధనవర్ణసంగ్రహ

అతిశా (క్రీ.శ.982-1054), క్రీ.శ. 11 వ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ భారతీయ బౌద్ధ భిక్షువు. ప్రముఖ బౌద్ధ పండితుడు. తంత్ర జ్ఞాని. విక్రమశిల మహావిహారానికి మఠాధిపతి. బెంగాల్ లోని పాల సామ్రాజ్యపు కాలంలో ప్రముఖ బౌద్ధ ధర్మ ప్రచారకుడు. అతను 11వ శతాబ్దపు ఆసియాలో బౌద్ధమతం వ్యాప్తిలో కీలకపాత్ర పోషించాడు. టిబెట్ లో 13 ఏళ్లకు పైగా భౌద్ధ ధర్మ ప్రచారం చేసాడు. టిబెట్ లో ప్రచలితమైన కదమ్ (Kadampa) అనే బౌద్ధ శాఖకి మూలపురుషుడు. టిబెట్ లో అత్యంత ఆదరాభిమానాలను పొందిన ఇద్దరు భారతీయ బౌద్ధ భిక్షువులలో అతిశా ఒకరు. చరిత్రలో ఆచార్య దీపాంకర్ శ్రీ జ్ఞాన్ గా పేరుపొందిన ఇతనిని టిబెట్ లో అతిశా, దీపాంకర్, అతిశా దీపాంకర్, జోవో (స్వామి), జోవో-జి (స్వామి భట్టారక్) అని పిలుస్తారు.
బిబిసి 2004లో నిర్వహించిన పోల్ లో అత్యంత గొప్ప బెంగాలీలలో అతిశా 18వ స్థానంలో నిలిచాడు.[2][3][4]

ముఖ్యాంశాలు

[మార్చు]
  • బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) లోని విక్రమ్‌పూర్‌లో ఒక రాజవంశంలో జన్మించాడు. ఇతని తల్లి రాణి శ్రీ ప్రభావతీ, తండ్రి రాజా కళ్యాణశ్రీ.
  • సువర్ణభూమి (సుమిత్రా దీవి, ఇండోనేసియా) లో పర్యటించి అక్కడ ఆచార్య ధర్మపాల్ కు శిష్యుడై, 12 ఏళ్లపాటు బౌద్ధ ధర్మ గ్రంథాలపై విశేష అధ్యయనం చేసాడు.
  • భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత విక్రమశిల విహారానికి మఠాధిపతిగా, ప్రధాన బౌద్ధ భిక్షువుగా నియమించబడ్డాడు.
  • టిబెట్ చక్రవర్తి కోరికపై, తన 59 ఏళ్ల వయస్సులో భారతదేశం నుండి బయలుదేరి, టిబెట్ చేరుకొన్నాడు. అక్కడ 13 ఏళ్ల పాటు నివసించి భౌద్ధ ధర్మప్రచారం చేసాడు.
  • బోధిచిత్త భావనను, అభ్యాసాన్ని టిబెటన్ బౌద్ధమతంలో ప్రవేశపెట్టడమనేది అతిశా తోనే ఆరంభమయ్యింది.
  • ఇతని బోధనల ఆధారంగా చేసుకొని టిబెట్ బౌద్ధంలో కదమ్ (kadampa) శాఖ రూపుదిద్దుకొంది.
  • బౌద్ధ ధర్మతత్వంపై సుమారు 200 కు పైగా గ్రంథాలను రచించాడు. అనువదించాడు. సవరించాడు. అతిశా రచనలలో బోధిపథ ప్రదీప మిక్కిలి ప్రసిద్ధి పొందింది.
  • టిబెట్ లో క్షీణిస్తున్న బౌద్ధమతం యొక్క పునరుజ్జీవనంలో నిరుపమానమైన, మహత్తరమైన కృషి చేసిన ఇతనిని అతిశా (గొప్పవాడు) గా టిబెట్‌లో గౌరవించారు.
  • ఆచార్య పద్మసంభవుని తర్వాత టిబెట్ లో అత్యంత ఆదరాభిమానాలను పొందిన రెండవ భారతీయ బౌద్ధ భిక్షువు అతిశా.
  • తన 72 వ ఏట నైరుతి టిబెట్ లోని నైతాంగ్ లో మరణించాడు.

ఆధార గ్రంధాలు

[మార్చు]

భారత ఉపఖండానికి చెందిన ప్రముఖ బౌద్ధ భిక్షువు 'అతిశా' యొక్క పేరు, అతని కీర్తి ప్రతిష్ఠలు 19వ శతాబ్దపు చివరి దశాబ్దం వరకూ బాహ్య ప్రపంచానికి తెలియదు. 19వ శతాబ్దం చివరి భాగంలో, వలసవాద బ్రిటిష్ సామ్రాజ్యపు దూత, ప్రస్తుత బంగ్లాదేశ్ కు చెందిన పండితుడు-దౌత్యవేత్త అయిన శరత్ చంద్ర దాస్ (1849-1917), టిబెటన్ తంజూరులో లిఖించబడిన చారిత్రక శిథిలాల రికార్డుల నుండి ఆధారాలు వెలికి తీసిన తరువాతనే అతిశా యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం వెలుగుచూసింది. నిషేధిత టిబెట్ భూమిని శరత్ చంద్ర దాస్ అనేకసార్లు సందర్శించి, చేసిన చారిత్రిక, పురావస్తు అన్వేషణల ఫలితంగా, 1893లో ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా వారు "ఇండియన్ పండిట్స్ ఇన్ ది ల్యాండ్ ఆఫ్ ది స్నోస్", "ట్రావెల్ అకౌంట్స్ ఆఫ్ టిబెట్" అనే రెండు విశిష్టమైన పుస్తకాలను బ్రిటిష్ జియోగ్రాఫికల్ సొసైటీ, లండన్ వారి సహకారంతో ప్రచురించారు. దానితో టిబెట్ యొక్క అద్భుతమైన చరిత్ర వెలుగులోకి వచ్చి, కాల విస్మృతికి లోనైన బెంగాల్‌కు చెందిన బౌద్ధ బిక్షువులు ముఖ్యంగా అతిశా (దీపాంకర్ శ్రీ జ్ఞాన్) -టిబెట్ భూమిలో అతను చేసిన అవిరళ కృషి గురించి మొట్ట మొదటిసారిగా ప్రపంచానికి వెల్లడైంది. అతిశా యొక్క జీవిత విశేషాలు, టిబెట్ లో అతని బౌద్ధ మిషన్ కార్యకలాపాలు ప్రధానంగా శరత్ చంద్ర దాస్ అధ్యయనాల ఆధారంగా పునర్నిర్మించబడ్డాయి. అతిశా గురించి తెలుసుకోవడానికి టిబెటిన్ చారిత్రక గ్రంథాలు, ఆయన జీవితచరిత్రను తెలిపే గురు-గుణ-ధర్మాకర్ ముఖ్య ఆధార వనరులుగా ఉన్నాయి.

ప్రారంభ జీవితం

[మార్చు]

అతిశా జనన, మరణ తేదీలకి సంబంధించి భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే చాలా మంది బౌద్ధ పండితులు అతను క్రీ.శ. 980 లేదా 982/983లో జన్మించాడని పేర్కొంటారు. అతను బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత మున్షిగంజ్జిల్లాలోని విక్రమ్‌పూర్‌ లోని చారిత్రక ప్రాంతంలోని వజ్రయోగిని గ్రామంలో క్రీ.శ. 982 లో జన్మించాడు. చైనా, బంగ్లాదేశ్‌కు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం, పురాతన నగరం విక్రమ్‌పూర్ లో వెలికి తీసిన చారిత్రాత్మక శిథిలాలు, పురావస్తు ఆధారాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే టిబెటిన్ చరిత్ర రచనలు, అతిశా భారతదేశంలోని బీహార్ సహోర్ రాజ్యంలో భాగల్ పూర్ ప్రాంతంలో గౌడ రాజవంశంలో క్రీ. శ. 982 లో జన్మించాడని తెలుపుతున్నాయి.

విక్రమ్‌పూర్‌ పాలకుడు, చంద్ర వంశానికి చెందిన రాజా శ్రీచంద్ర అతని తాత.[5] అతని తల్లి రాణి శ్రీ ప్రభావతీ. తండ్రి రాజ్య పాలకుడైన రాజా కళ్యాణశ్రీ. వీరు బౌధ్ధమతాభిమానులు. వారి ముగ్గురు సంతానంలో రెండవ వాడు అతిశా. అతని చిన్ననాటి పేరు చంద్రగర్భ. ఇరువురు సోదరులు పద్మగర్భ, శ్రీగర్భ. అతిశా జన్మతా రాకుమారుడైనప్పటికీ చిన్నతనం నుండే బౌద్ధ ధర్మం వైపుకి ఆకర్షితుడయ్యాడు. మూడవ ఏటనే విద్యాభ్యాసం ప్రారంభమైంది. పది సంవత్సరాల వయస్సులో బౌద్ధ, బౌద్ధేతర గ్రంథాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడంలో అరుదైన ప్రతిభను చూపించాడు. 11 ఏళ్ళకి గణితం, వ్యాకరణం, బౌద్ధ సాహిత్యం క్షుణంగా అభ్యసించాడు. అతను మహావైయాకరన్ బౌద్ధ పండితుడు జెత్రి సలహాపై గ్రంథాలను అధ్యయనం చేయడానికి నలందకు వెళ్లాడు. 12 వ సంవత్సరంలో నలందా లోని ఆచార్య బోదిభద్ర వద్ద శ్రమణ దీక్షను పొందాడు. అప్పటినుండి దీపంకర్ శ్రీ జ్ఞాన్ పేరుతొ పిలవబడ్డాడు. తన 12 వ ఏట రాజగృహంలో అవధూతి పా అనే బౌద్ధ సిద్ధాచార్యులకు శిష్యుడై ఆరు సంవత్సరాలు పాటు శాస్త్రాభ్యాసం చేసాడు. హేతువిద్యలో విశేష ప్రావీణ్యం పొందాడు. తన 18 వ ఏట విక్రమశిలలో ఆనాటి గొప్ప తాంత్రికుడు అయిన నారోపా వద్ద శిష్యునిగా చేరాడు. నారోపా, ఆనాటి విక్రమశిల మహావిహారానికి ఉత్తర ద్వారా పండితుడుగా ఉండేవాడు. నారోపా వద్ద 11 ఏళ్లపాటు తాంత్రిక విద్యలలో శిక్షణ పొందాడు. అనువంశిక రాచరిక వారసత్వాన్ని, వైవాహిక జీవితాన్ని త్యజించిన అతిశా, బౌద్ధ ధర్మాధ్యయనాన్నే జీవితాదర్శంగా చేసుకొన్నాడు. తదనంతరం తన 30 వ ఏట బుద్ధగయలో మహావినయధర శీలరక్షిత వద్ద ఉపసంపద (బౌద్ధ దీక్ష) పొందాడు. ఈ విధంగా 30 ఏళ్లకే బౌద్ధధర్మంలో నిష్ఠాగరిష్ఠుడైన అతిశా త్రిపీటకాలలోను, తంత్ర విద్యలలోను అపూర్వ పాండిత్యం సముపార్జించాడు.

సువర్ణ ద్వీప పర్యటన (క్రీ. శ. 1013-25)

[మార్చు]

దీపాంకర్ శ్రీ జ్ఞాన్ (అతిశా) బుద్ధగయలో వున్నప్పుడే, సువర్ణాద్వీప ఆచార్యుడైన ధర్మపాల్ యొక్క ఖ్యాతి విని, అతని వద్ద బౌద్ధ ధర్మ గ్రంథాలపై విశేషాధ్యయనం చేయడానికి నిశ్చయించుకొన్నాడు. క్రీ.శ. 1013 లో అతిశా తన 125 మంది శిష్యులతో కలసి బెంగాల్ తీరంలో ఓడ ఎక్కి, సువర్ణ ద్వీపానికి (నేటి సుమిత్రా దీవి) బయలుదేరాడు. హిందూమహాసముద్రంలో పదమూడు నెలలపాటు కష్టభరితమైన నౌకా ప్రయాణం సాగించి సువర్ణ ద్వీపానికి చేరుకొన్నాడు. అక్కడ ఆచార్య ధర్మపాల్ వద్ద శిష్యునిగా చేరి 12 ఏళ్లపాటు బౌద్ధ ధర్మ గ్రంథాలను విశేషంగా అధ్యయనం చేసాడు. బౌద్ధ తత్వశాస్త్రంలో వివిధ కోణాలను అధ్యయనం చేసాడు. అభిసమయాలంకార్, బోధి కార్యావతన్ లతో పాటు అనేక సూత్ర గ్రంథాలను చదివి సంపూర్ణ బోధిచిత్తుడైనాడు. తరువాత గురువు వద్ద సెలవు తీసుకొని, తిరుగు ప్రయాణంలో రత్న ద్వీపం, శ్రీలంక మొదలగు ద్వీప దేశాల్లో పర్యటించాడు. శ్రీలంకలో వున్నప్పుడు వివిధ బాహ్య, గుహ్య (exoteric and esoteric) శాఖలకు చెందిన బౌద్ధతత్వాలపై అధ్యయనం చేసాడు. అతిశా శ్రీవిజయ సామ్రాజ్యంలోని సుమిత్రాలో 12 సంవత్సరాలు గడిపాడని, 1025 లో అతను భారతదేశానికి తిరిగి వచ్చాడనీ, అదే సంవత్సరం చోళ రాజవంశానికి చెందిన మొదటి రాజేంద్ర చోళుడు సుమిత్రాపై దండెత్తినట్లు టిబెటన్ ఆధారాలు నొక్కి వక్కాణించాయి.[6] క్రీ.శ. 1025 లో తన 43 వ ఏట అతిశా భారతదేశం చేరుకొన్నాడు. అప్పటికే త్రిపిటక, థేరవాద, మహాయాన బౌద్ధమతం, తంత్రాయణంలో ప్రావీణ్యం సంపాదించడంతో పాటు తర్క, తత్వశాస్త్రంలో సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. బౌద్ధంలోని విభిన్న బాహ్య, గుహ్య తత్వాలలో నిష్ణాతుడయ్యాడు. ఈ విధంగా భారతదేశం వచ్చేసరికి అతిశా దీపాంకర్ తన అపారమైన జ్ఞాన సముపార్జనాతో, అద్భుతమైన బౌద్ధ పండితుడిగా పరిగణించబడ్డాడు.

విక్రమశిల ఆశ్రమ మఠాధిపతి

[మార్చు]

పాల రాజు మహిపాలుడు ఇతని ప్రత్యేకతలను గుర్తించి విక్రమశిలకు మఠాధిపతిగా, మహావిహారానికి ప్రదాన బౌద్ధ భిక్షువుగా నియమించాడు. భారతదేశంలో బౌద్ధమతం వర్ధిల్లుతున్నప్పుడు, అతిశా విక్రమశిల ఆశ్రమానికి మఠాధిపతిగా బోధనా బాధ్యతలు చేపట్టాడు. అక్కడ వున్న 51 మంది బౌద్ధ పండిత సమూహానికి అధికారిగా, 108 బౌద్ధాలయాలకి సంరక్షకునిగా ఉన్నాడు. నాటి విక్రమశిలకు సంఘస్థవిరుడుగా రత్నాకర్ శాంతి ఉండేవాడు.[7] అతిశా తన విశేష ప్రతిభా సంపన్నలతతో విక్రమశిలకు చెందిన అష్ట మహా పండితులలో ఒకనిగా కీర్తించబడ్డాడు. శాంతిభద్ర, రత్నాకర్ శాంతి (శాంతిపా), మైత్రిపా (అవధూతి పా), దోంబి పా, స్థవిరభద్ర, స్మృత్యాకార సిద్ధ వంటి గొప్ప బౌద్ధ పండితులలో ఒకనిగా పరిగణించబడ్డాడు.

టిబెట్ పర్యటన

[మార్చు]

టిబెట్‌కు దీపాంకర్ రాకతో అక్కడ బౌద్ధమత వ్యాప్తికి సంబంధించిన అనేక చారిత్రక సంఘటనలు పరాకాష్ఠకు చేరుకొన్నాయి.[8] సాంప్రదాయ కథనాల ప్రకారం, కడపటి టిబెట్ చక్రవర్తి లాంగ్ ధర్మా యొక్క అస్థిర పాలనలో, టిబెటన్ బౌద్ధమతం క్రూరంగా అణిచివేయబడింది. 70 సంవత్సరాలకు పైగా బౌద్ధ మతానుచరులను నిర్దాక్షిణ్యంగా హింసిస్తూ కొనసాగిన పీడన పర్యవసానంగా టిబెట్ లో బౌద్ధ సన్యాసుల సంప్రదాయం అనేది దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. భౌద్ధమతం ధార్మిక పదభ్రష్టతతో క్షీణించింది. తరువాత వచ్చిన నాటి టిబెట్ చక్రవర్తి లామా యేశే-ఓ (La-Lama-Yi-Sivori), బౌధ్ధమతానురక్తుడై, తన రాజ్యంలో అధోగతి పాలైన బౌద్ధ ధర్మానికి పునఃరుత్తేజం కలిగించడానికి, తన మాతృభూమి టిబెట్ కి ధర్మాన్ని బోధించడానికి రావాలని భారతదేశానికి చెందిన అతిశా దీపాంకర్ ను వేడుకొన్నాడు. గొప్ప గౌరవ పురస్కారాలు ఇస్తామని చక్రవర్తి వాగ్దానం చేసినప్పటికీ, తాను విక్రమశిలలో నిర్వర్తించాల్సిన గురుతర, పాలనా బాధ్యతల కారణంగా అతిశా దీపాంకర్ ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించాడు. కానీ ఆ టిబెట్ చక్రవర్తి తన శత్రువుల చేతిలో అనూహ్యంగా బందీ కావడంతో అతని కుమారుడు ల్లామా ఛజ్-చూప్-ఓ టిబెట్ రాజయ్యాడు. అతను తన తండ్రి అంతిమ కోరిక మేరకు, మరోసారి అతిశాను టిబెట్ కు ఆహ్వానించడానికి నిశ్చయించుకొని, దానికోసం గుజ్-దజ్-పా అనే బౌద్ధ బిక్షువు ఆధ్వర్యంలో ఒక ప్రత్యక మిషన్ ను భారతదేశానికి పంపించాడు. టిబెట్ లోని విషాదకర పరిణామాలు విన్నమీదట అతిశా నూతన చక్రవర్తి కోరిక మేరకు టిబెట్ లో ధర్మప్రచారానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు.

దీపాంకర్ టిబెట్ కు వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నప్పుడు, విక్రమశిలకు సంఘస్థవిరుడు, మహానాయకుల్లో ఒకరైన ఆచార్య రత్నాకర్ శాంతి ఇలా అన్నారు "దీపాంకర్ లేని భారతదేశం అంధకారంలో మునిగిపోతుంది. అనేక బౌద్ధ సంస్థలకు అతను కీలకంగా ఉన్నాడు. ఆయన లేని సమయంలో ఈ సంస్థలన్నీ ఖాళీగా మిగులుతాయి. భారత్‌పై దండెత్తాలని చూస్తున్న టర్కిష్ సైనికులతో భారతదేశానికి ఒక చీకటి నీడ కమ్ముకున్నట్లు కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో అతిశా వెళ్ళిపోతే ధర్మసూర్యుడు ఇక్కడ అస్తమించే ప్రమాదం వుందని నేను తీవ్రంగా ఆందోళన పడుతున్నాను. అయినప్పటికీ, సర్వ జీవుల పట్ల కారుణ్యంతో టిబెట్ సందర్శిస్తున్నందుకు నేను దీపాంకర్‌ను సంతోషంతో ఆశీర్వదిస్తున్నాను." [8] ఈ పరిస్థితులలో టిబెట్ లో బౌద్ధమతాన్ని పునః స్థాపించడంలో సహాయపడటానికి చక్రవర్తి ఆహ్వానం మేరకు క్రీ.శ.1040 లో అతిశా తన 12 మంది అనుచరులతో కలసి విక్రమశిల విహారం నుండి బయలుదేరి, టిబెట్‌కు ప్రమాదకరమైన హిమాలయాల మీదుగా ప్రయాణించాడు.

క్రీ.శ.1041 లో అతిశా మొదట నేపాల్ కు చేరుకొన్నాడు. నేపాల్ రాజు అనంతకీర్తి ఆహ్వానాన్నీ మన్నించి, ఒక సంవత్సరం అక్కడే గడిపి ధార్మిక కార్యాలు నిర్వర్తించాడు. నేపాల్ రాకుమారుడు పద్మప్రభకు బౌద్ధమత దీక్షను ఇచ్చాడు. నేపాల్ లో వున్నప్పుడు అతిశా, నాటి మగధ రాజు 'నయపాల'కు రాసిన ఉత్తరం 'విమలరత్నలేఖన' యొక్క టిబెట్ అనువాదం ఇప్పటికీ టిబెట్ లోని తంజ్యుర్ (Tengyur) లో పదిలపరచబడింది. [8] తరువాత నేపాల్ గుండా పశ్చిమ టిబెట్ లోని పురాంగ్ (Purang) రాజ్యం యొక్క రాజధాని అయిన థోలింగ్ కు (Tholing) వెళ్లే మార్గంలో ప్రయాణించాడు. ప్రమాదాల మధ్య హిమాలయాలలోని మంచు పర్వత భూభాగాల మీదుగా టిబెట్‌కు కాలినడకన అతని ప్రయాణం సాగింది. థోలింగ్‌కు వెళ్ళడానికి ముందు గుజ్ (Gunge) రాజ్యానికి క్రీ.శ. 1042 లో చేరుకొన్నాడు. అక్కడి గుజ్ (Guge) విహారంలో నివసిస్తున్నప్పుడే అతని ప్రియ శిష్యుడు, టిబెట్ భాషనువాదకుడు (లోచవా) గ్య-చోన్ -సేజ్ (Rgya-lo-tsa-ba-brtson-'grus-seng-gay) అనారోగ్యానికి గురై మరణించడం జరిగింది.

క్రీ.శ.1042 లో అతిశా టిబెట్‌లోని పశ్చిమ ప్రావిన్స్ జరీ (Ngari) కి చేరుకున్నప్పుడు, అక్కడి గుజ్ (Guge) రాజ్యపు పాలకుడు లా-లామా-బ్యాంగ్-చుబ్-ఓడ్ స్వాగత సత్కారాలతో ఘనంగా ఆహ్వానం పలికి అతిశాను థోలింగ్ (టోలుంగ్‌) విహారానికికు తీసుకెళ్లారు. ఇక్కడే దీపాంకర్ గౌరవార్థం అక్కడ రాగదున (Ragaduna) అనే సంగీత వాయిద్యం కనుగొనబడినదని ప్రతీతి. ఈ థోలింగ్ విహారంలో అతిశా 9 నెలలు ఉన్నాడు. ఇక్కడ వున్నప్పుడు అతిశా ధర్మోపదేశాలతో పాటుగా ఎన్నో ధర్మ గ్రంథాలను రాయడం, టిబెటిన్ లోకి అనువదింపచేయడం జరిగింది. అతని సిద్ధ పుస్తకం బోధిపథ ప్రదీప్ ఇక్కడనే రాయబడింది.

క్రీ.శ.1044 లో అతిశా పురాంగ్ (Purang) చేరుకొన్నాడు. పురాంగ్ లో వున్నప్పుడే అతని ప్రియ శిష్యుడు డోమ్-తోన్ అతనిని మొట్టమొదటిసారిగా కలుసుకోవడం జరిగింది.[9] ఈ డోమ్-తోన్, తరువాతి కాలంలో అతిశా చివరివరకు వెన్నంటి వుండి, గురువు మరణాంతరం అతని జీవిత చరిత్రను గురు-గుణ-ధర్మాకర్ పేరిట రచించాడు.

తొలి మూడు సంవత్సరాలలో (1042-44), గుంజ్ (Gunge) రాజ్యంలోను, జరీ భూభాగంలోను సాధించిన గణనీయమైన ధార్మిక విజయంతో, అతిశా ఖ్యాతి టిబెట్ అంతటా శరవేగంతో విస్తరించింది. అయితే అతిశా తన భారతీయ శిష్యులకు ముందుగా చేసిన వాగ్దానం మేరకు, విక్రమశిల విహార బాధ్యతలను స్వీకరించడంకోసం తన స్వదేశానికి తిరిగి రావాలని ఆశించాడు. కానీ భారతదేశానికి వెళ్లే మార్గంలో నేపాల్‌లో తీవ్ర రాజకీయ అస్థిరతలు మూలంగా, స్థానిక యుద్ధాలు చెలరేగడంతో అతని ప్రయాణంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ లోగా మధ్య టిబెట్ లోని లాసా, సామ్యే ప్రాంతాలను కూడా సందర్శించాలని టిబెట్ నుంచి వచ్చిన ప్రత్యేక వినతుల మేరకు, భారతదేశం వెళ్లే యోచనను విరమించుకొని, మధ్య టిబెట్‌లో ధమ్మాన్ని వ్యాప్తి చేసే పనిలో అతను నిమగ్నమైపోయాడు.

ఆ తరువాత అతిశా తన శిష్యులతో పాల్ థాంగ్ (dpal thang), స్కైడ్ గ్రోంగ్ (skyid grong) మొదలగు ప్రదేశాలను దాటుకుంటూ క్రమంగా తూర్పు వైపుకు ప్రయాణించాడు. బౌద్ధులు ఒకరి తరువాత ఒకరుగా అతిశాను ఆహ్వానించారు. వెళ్లిన చోటల్లా బుద్ధుని బోధనల సారాంశాన్ని ప్రజల్లో నింపుతూ, బౌద్ధ ధర్మాన్ని వ్యాపింపచేస్తూ వచ్చాడు. స్నా-పో-లా (sna po la) ప్రాంతాన్ని చేరుకున్నప్పుడు అక్కడి స్థానిక ప్రభువు అతనికి మేళతాళాలతో, కొమ్ము బూరలతో స్వాగతం పలికి అతని గౌరవార్ధం, ప్రజలకు ఉపయోగపడేలా, బ్రహ్మపుత్రా నదికి ఉపనది అయిన యార్లంగ్ త్సాంగ్ పో (Yarlung Tsangpo) నదిపై ఒక ఆనకట్టను నిర్మించాడు.

క్రీ.శ. 1047 లో మధ్య టిబెట్ లో చేరుకున్న తర్వాత, అతను నేరుగా లాసాకు దక్షిణంగా చింపు (chimpu) లోయలో వున్న ప్రసిద్ధ సామ్యే (Samye) బౌద్ధ మఠం చేరుకొన్నాడు. ఇది టిబెట్‌లో నిర్మించిన మొట్టమొదటి టిబెటన్ బౌద్ధ మఠం. జామ్‌గోన్ కొంగ్‌ట్రుల్ (Jamgon Kongtrul) ప్రకారం, అతిశా సామ్యే (Samye) మఠం యొక్క గ్రంథాలయమైన పెకర్ కోర్డ్‌జోలింగ్‌ (Pekar Kordzoling) లో వున్న సంస్కృత గ్రంథ భండాగారాన్ని దర్శించి ఆశ్చర్యచకితుడయ్యాడు. అక్కడ వున్న అపారమైన సంస్కృత బౌద్ధ గ్రంథ సారస్వతాన్ని చూసి, అక్కడ వున్నన్ని గ్రంథాలు భారతీయ విశ్వవిద్యాలయాలలో కూడా లేవని, టిబెట్‌లో వజ్రయానం విస్తరించిన స్థాయి, అది పుట్టిన భారతదేశంలో కూడా కానరాదని, దానికి సాటిలేదని పేర్కొని ముకుళిత హస్తాలతో అంజలి ఘటించి, దానికి కారకులైన మునుపటి శతాబ్దాలకు చెందిన గొప్ప బౌద్ధ ధర్మ రాజులు, అనువాదకులు, పండితులను ప్రశంసించాడు."[10]

అతను సామ్యే మఠం నుండి నైతాంగ్ కు బయలుదేరినప్పుడు అతనికి 200 మంది భటులు కాపలాగా వున్నారని చెప్పబడింది. నైతాంగ్ లో వున్నప్పుడు బౌద్ధ సన్యాసులు కాబోయేవారికి తర్కం, క్రమశిక్షణ, పాండిత్యం అనే మూడు స్థాయిలలో నిపుణత్వం వుండాలని బోధించాడు.

క్రీ.శ.1050 లో అతిశా లాసా సమీపంలోని యేర్-పా (Yerpa) మఠాన్ని చేరుకొన్నాడు. ఇక్కడ బౌద్ధ ధర్మం గురించి విస్తృతంగా బోధించడంతో పాటు అసంగుని యొక్క 'మహాయాన ఉత్తర తంత్ర శాస్త్ర వివరణ'ను టిబెట్ లోకి అనువదించడంలో లోత్సవాలకి సహాయం చేసాడు. శాక్య కాగ్వా అనే ప్రసిద్ధ భిక్షువు ఆహ్వానం మీద పాంగ్ పో (Pang po) లో ధర్మ ప్రచారం చేసి తిరిగి నైతాంగ్ చేరుకున్నాడు.

బౌద్ధమతంలో అతిశా సంస్కరణలు

[మార్చు]
అతిశా శిల్పం (13 వ శతాబ్దం)

అతిశా దీపంకర్ టిబెట్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి బౌద్ధమతంలో విస్తృతమైన సంస్కరణలను చేపట్టాడు. టిబెటన్ బౌద్ధమతానికి తాంత్రిక విధానాన్ని తొలగించే ప్రయత్నంలో స్వచ్ఛమైన మహాయాన సిద్ధాంతాన్ని బోధించాడు. తన సంస్కరణలతో ప్రజలను ఆకర్షించాడు, బుద్ధుని సందేశాన్ని సరళీకృతం చేశాడు. దీపంకర్ రాక ముందు ఆనాడు టిబెట్‌లో వున్న ఏకైక ఆధిపత్య సంప్రదాయం నింగ్మా (nyingma) సంప్రదాయం మాత్రమే. ఇది వజ్రయాన అధ్యయనాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. మంత్ర తంత్రాలు, మెటాఫిజిక్స్‌పై దృష్టి సారించే నింగ్మా సంప్రదాయం, సామాన్యుల అవగాహనకు దూరంగా ఉంటూ క్లిష్టంగా మార్మిక రహస్యాలతో కూడి, మూఢ విశ్వాసాలపై ఆధారపడి ఉండేది. దానితో నిజమైన బౌద్ధమతం తీరుతెన్నులు పట్ల సాధారణ టిబెటియన్లకు అసలు అవగాహన వుండేది కాదు. అటువంటి నింగ్మా సంప్రదాయపు తెరలలో చిక్కుకున్న బౌద్ధధర్మం క్షీణించి పెడదారి పడుతున్నట్లుగా అతిశా భావించాడు. అందువల్ల అతిశా నింగ్మాకు బదులుగా బౌద్ధమతంపై ప్రజల్లో నెలకొన్న ఆనాటి అవగాహనను సంస్కరిస్తూ, బుద్ధుని అసలు సందేశాన్ని సరళీకృతం చేశాడు. మంత్ర తంత్రాలతో నిమిత్తం లేని నిజమైన బౌద్ధ తత్వాన్ని ప్రజాబాహుళ్యానికి పరిచయం చేసాడు. అతిశా ప్రవచించిన బౌద్ధమతం ప్రజ్ఞాపారమిత తత్వశాస్త్రం (సిద్ధాంతం లేదా జ్ఞానం) పై ఆధారపడింది.

విశ్రాంతి ఎరుగని నిరంతర ధర్మ బోధకుడుగా, అతిశా ఆ నాడు టిబెట్ లో ప్రబలంగా ఉన్న బలులు, అర్పణలు, నిగూఢమైన ఆచారాలు, మతం పేరుతో సాగుతున్న అనేక ఇతర నీచమైన భావాలకు వ్యతిరేకంగా పోరాడాడు. మూఢ నమ్మకాల నుండి ప్రజలను విముక్తి చేయడానికి, ఉన్నత విలువలతో కూడిన నైతిక జీవనానికి, నైతికతకు ప్రాధాన్యం ఇస్తూ, కరుణ యొక్క సిద్ధాంతాన్ని బోధించాడు. టిబెటన్ బౌద్ధమతంలో అప్పటివరకూ ఎన్నడూలేని మనో శిక్షణా పద్ధతులను (Lojong) అభివృద్ధి చేసాడు. దానిలో భాగంగా బోధిచిత్త అనే భావనను, అభ్యాసాన్ని టిబెటన్ బౌద్ధమతంలో ప్రవేశపెట్టడం అతిశా చేసిన గొప్ప సంస్కరణగా నిలిచింది.

అతిశా తాను వ్యక్తిగతంగా తంత్రానికి మద్దతుదారు అయినప్పటికీ, ఒక సన్యాసిగా క్రమశిక్షణ, ఆధ్యాత్మికత మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో అతనికి బాగా తెలుసు. అతను టిబెట్ లో ఎక్కడికి వెళ్లినా ధర్మ దీక్షలను అందించాడు, గ్రంథాల అనువాదాలు చేసాడు, బౌద్ధ మఠాలను నిర్మించాడు. అతిశా యొక్క బోధనలతో, అతని మహోన్నత వ్యక్తిత్వం యొక్క ఛత్రఛాయలో మధ్య టిబెట్ లో బౌద్ధమతం సంస్కరించబడి పునరుజ్జీవనాన్ని చూసింది.

టిబెట్‌లో బౌద్ధమత వ్యాప్తి

[మార్చు]
రాలుంగ్ బౌద్ధమఠంలో అతిశా కుడ్యచిత్రం (1993)

అతిశా రాక టిబెట్‌లో బౌద్ధమత చరిత్రలో నూతన కాలానికి నాంది పలికింది. గుజ్ (Gunge) రాజ్యంలో వున్నప్పుడు, మత సంస్కరణలు కీలకమని గ్రహించిన అతిశా దీపంకర్, తొలి మూడు సంవత్సరాలలోనే టిబెట్ భూమిలో స్వచ్ఛమైన మహాయాన బౌద్ధమత పునాదిని బలంగా నిర్మించాడు.[8] అక్కడి గుజ్ రాజ్యంలో సాటిలేని గొప్ప బౌద్ధ పండితుడు, అనువాదకుడు అయిన 85 ఏళ్ల రిన్-చెన్-గ్జాన్-పో (Rinchen Zangpo) (క్రీ.శ.958-1055) లేదా రత్నభద్రతో సమావేశమై అతన్ని తన అభిప్రాయాలకు అనుగుణంగా మార్చాడు. ధర్మం పట్ల అతనికి మిగిలివున్న సందేహాలను నివృత్తిని చేసి అతన్ని తన శిష్యునిగా చేసుకొన్నాడు.[11] బోధి పథ ప్రదీప్' ద్వారా అతను బుద్ధుని సిద్ధాంతానికి అనుగుణంగా టిబెట్ ప్రజల నైతికతను పెంచడంలో విజయం సాధించాడు.[8] డ్రోమ్-తోన్ తో అతిశా సమావేశమై, అతన్నీ తన శిష్యునిగా చేసుకొన్నాడు. ఇతను అతిశా శిష్యులలో అగ్రగామిగా ఉంటూ అతిశ చేపట్టిన బౌద్ధ మత సంస్కరణ ఉద్యమాన్ని టిబెట్ అంతటా విజయవంతంగా నిర్వహించడంలో అతనికి తోడ్పడ్డాడు. అనంతర కాలంలో మహాయాన బౌద్ధమతం యొక్క సారాంశం ఆధారంగా కడంప శాఖను స్థాపించాడు. చురుకైన శిష్యులు, అనుచరుల మద్దతుతో అతిశా ఒక మిషనరీ వలె విశాలమైన టిబెట్ పీఠభూమిలో ఒకచోటనుండి మరోచోటకు నిర్విరామంగా ప్రయాణిస్తూ, సరళీకరించిన బౌద్ధమత నిజమైన సందేశాన్ని సాధారణ టిబెట్ ప్రజల చేరువకు తీసుకుపోయాడు. టిబెట్ ప్రజాబాహుళ్యంలో అతని బోధనలకు విశేష ప్రజాదరణ ఉండేది. తను మరణించేవరకు 13 ఏళ్లపాటు అవిశ్రాంతంగా టిబెట్ లో పర్యటిస్తూ అక్కడి సామాన్య ప్రజానీకంలో నైతికతను, కరుణను, ఉన్నత విలువలను, సరళ బౌద్ధ ధర్మ తత్వాన్ని పెంపొందింప చేశాడు. నింగ్మా సంప్రదాయానికి వ్యతిరిక్తమైన తన సరళ బోధనలతో, సంస్కరణలతో, అక్కడి ప్రజలను అమితంగా ప్రభావితం చేసాడు.

అతను ప్రజల మనస్సులలో బుద్ధుని బోధనలలోని ప్రాథమిక నైతిక సూత్రాలను, స్వచ్ఛమైన మహాయాన బౌద్ధమత సారాంశాన్ని నింపాడు. ప్రపంచం యొక్క అశాశ్వతతను (అనిత్య) బోధిస్తూ, తంత్రం యొక్క నిజమైన అభ్యాసం కర్మలలో లేదని, మనస్సును ధ్యానంలో కేంద్రీకరించడంలో ఉందని బోధించాడు. అతను దుఃఖమయ జీవితం నుండి విముక్తి కోసం, ఒకవైపు ధ్యానం, నైతిక స్వచ్ఛతలను ప్రోత్సహిస్తూనే, మరోవైపు తంత్ర యొక్క క్షుద్ర అభ్యాసాలకు వ్యతిరేకంగా పోరాడాడు. మహాయాన సిద్ధాంతాలతో, అతను అంతులేని బాధల సంకెళ్ల నుండి మానవాళికి మోక్షం చూపే గురువుగా ఉద్భవించాడు.[8] అనతికాలంలోనే తన బోధనలతో మొత్తం టిబెటన్ సమాజాన్ని ప్రక్షాళన చేసి వారిని ధర్మ మార్గంలో మేల్కొల్పాడు.

అతిశా దీపంకర్ టిబెట్ లో మహాయాన పద్ధతిలో అక్కడి బౌద్ధమతాన్ని సంస్కరించాడు. ప్రజలు క్షుద్ర అభ్యాసాలలో పాల్గొనడాన్ని నివారించాడు. మలిన ఆచారాలు, మూఢ నమ్మకాలతో మతాన్ని దుర్వినియోగం చేయడానికి అతను ఎన్నడూ అనుమతించలేదు. టిబెటిన్ బౌద్ధమతం నుండి తాంత్రిక అంశాలను తొలగించడానికి అతిశా చేసిన నిరంతర ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయి. దెయ్యాలు, భూతవైద్యం, హత్య, వ్యభిచారం వంటి అనేక సామాజిక వ్యతిరేక కార్యకలాపాల మీద అక్కడి ప్రజలలో పాతుకుపోయిన మూఢ నమ్మకాలను పారదోలడం ద్వారా యావత్తు టిబెటన్ సమాజాన్ని సంస్కరించడంలో అతిశా గొప్ప విజయం సాధించాడు.[8] మరోవైపు అతిశా బౌద్ధ సన్యాసులకు కూడా కఠినమైన క్రమశిక్షణా మార్గదర్శకాలను నిర్దేశించాడు. సన్యాసిగా మారాలంటే తర్కం, క్రమశిక్షణ, పాండిత్యం అవసరమని, వాటిని ముఖ్య బోధనాంశాలుగా చేర్చడం ద్వారా, సన్యాసుల పాఠ్యాంశాలను క్రమబద్ధీకరించాడు.[12]

కార్యసంగ్రహప్రదీప వంటి రచనలలో అతిశా స్వరపరిచిన కొన్ని కీర్తనలు ఉన్నాయి.'వజ్రాసన వజ్రగీతి', 'చార్యగీతి', వజ్రయోగిని స్తోత్రం వంటి సాహిత్య రచనలలో అతిశా స్వరపరిచిన కీర్తనలు, గేయాలు అతని జన్మస్థల జ్ఞాపకార్థం అంకితమైన అసలైన బెంగాలీ ఆధ్యాత్మిక పాటలను తలపిస్తాయి. [8] బౌద్ధమత సందేశాన్ని కలిగి ఉన్న గీత సాహిత్యాన్ని ప్రజలకు బోధించినప్పుడు ప్రజలు భక్తి శ్రద్ధలతో తాదాత్మ్యం చెందారు. నైతిక ప్రబోధంతో పాటు తన తాత్విక ఆలోచనలను వ్యాపింపజేయడం కోసం లిరికల్ సాహిత్యంతో టిబెటన్ ప్రజలను మేల్కొల్పిన అతిశా దీపాంకర యొక్క గొప్ప మనస్సును 1859లో, కొప్పెన్ అనే జర్మన్ పండితుడు కొనియాడాడు.[8]

అతిశా రాకతో టిబెటిన్ సమాజంలో నైతికవిలువలతో కూడిన నూతన శకం ప్రారంభమైంది. అతని బోధనలు టిబెట్ ప్రజలలో బౌద్ధమతం నుండి ఉద్భవించిన నైతికత, విలువలతో కూడిన నూతన భావనలు ప్రేరేపించాయి. అతను బుద్ధుని బోధనలలో నొక్కిచెప్పబడిన ప్రాథమిక నైతిక విలువలను టిబెటియన్లకు నేర్పించాడు. వారిలో బౌద్ధమత సారాంశాన్ని నింపాడు. దానితో క్రమేణా వారిలో మార్పు కలిగింది. అతిశా చేపట్టిన మత సంస్కరణలతో, నైతికవిలువలతో కూడిన తాత్విక బోధనలతో టిబెటన్లు తాము ఒక అద్వితీయమైన మత పునరుజ్జీవనం (religious renaissance) లో భాగస్వామ్యులయ్యామని గుర్తించారు శాఖలతో సంబంధం లేకుండా వేలాది మంది సన్యాసులు అతిశా బోధనలను అంగీకరించారు. ఆ నాటి టిబెటన్ చిత్రపఠంలో ఒక సాధారణ గొర్రెల కాపరి కూడా సరళమైన టిబెటన్ భాషలో బౌద్ధమత సందేశాన్ని కలిగి ఉన్న పుస్తకాలను తనతో తీసుకువెళ్లేవాడని చెప్పబడింది.[8] ఈ విధంగా అతిశా, టిబెట్ సమాజానికి ఒక మార్గదర్శి (Torchbearer) గా వుంటూ, తన ఉన్నత వ్యక్తిత్వంతో సాధారణ టిబెటియన్లపై అనన్యరీతిలో ప్రభావం చూపాడు. టిబెట్ లో పదమూడు సంవత్సరాల పాటు బౌద్ధమతాన్ని సంస్కరిస్తూ క్షీణిస్తున్న బౌద్ధ ధర్మానికి పునఃరుత్తేజం కలిగించాడు. ఆ తర్వాత జరిగిన అద్భుతమైన బౌద్ధ ధర్మ విస్తరణకు పునాదులు వేశాడు. తద్వారా చక్రవర్తి తన నుండి ఆశించిన కార్యభారాన్ని జయప్రదంగా నెరవేర్చగలిగాడు. టిబెటన్లు అతనికి వున్న ప్రజ్ఞకు, ధర్మ శాస్త్ర పారంగతకు, మహోన్నత వ్యక్తిత్వానికి మెచ్చి అతనికి అతిశా (The Great) బిరుదును ప్రదానం చేశారు. ఆచార్య పద్మసంభవుని తర్వాత టిబెట్ లో అత్యంత ఆదరాభిమానాలను పొందిన రెండవ భారతీయ బౌద్ధ భిక్షువు అతిశా మాత్రమే.

రచనలు

[మార్చు]

అతిశా దీపాంకర్ శ్రీజ్ఞాన్ బౌద్ధమత వ్యాప్తికి దోహదపడిన రెండు వందలకు పైగా గ్రంథాలను రచించారు, అనువదించారు, సవరించారు. అతని రచనలు తంత్ర, ప్రజ్ఞా పారమిత, మధ్యామిక, వ్యాఖ్య అనే నాలుగు సమూహాలుగా విభజించబడ్డాయి. అతిశా బౌద్ధ ధర్మ, తత్వంపై 35 కు పైగా గ్రంథాలు, 70 కి పైగా తాంత్రిక గ్రంథాలతో పాటు అనేక గ్రంథాలను టిబెటిన్ భాషలోకి అనువదించాడు. అయితే దీపాంకర్ సంస్కృతంలోను, పాళిలోను, మాతృభాషలోను రాసిన గ్రంథాలన్నీ ప్రస్తుతం అదృశ్యం అయిపోయాయి. కేవలం వాటి టిబెటన్ అనువాదాలు మాత్రమే ఇప్పుడు మిగిలివున్నాయి. అతని గ్రంథాలలో 79 టిబెటన్ (బోట్) అనువాదంలో తంజ్యుర్ సంగ్రహంలో భద్రపరచబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి.

  • బోధిపథప్రదీప: బుద్ధుని బోధనల సారాంశాన్ని సరళ భాషలో తెలియచేసిన చిన్న గ్రంథం.
  • కార్యసంగ్రహప్రదీప: నేపాల్ లో వున్నప్పుడు రచించబడింది. దీనిలో అతిశా స్వరపరిచిన కొన్ని కీర్తనలు ఉన్నాయి
  • సత్యద్బయవతార
  • మధ్యమోపదేశం
  • సంగ్రహగర్భ
  • హృదయనిశ్చింత
  • బోధిసత్వ మాన్యబలి
  • బోధిసత్వ కర్మాదిమార్గావతార
  • శరణాగతదేశ
  • మహాయానపథసాధనవర్ణసంగ్రహ
  • శుభార్థసముచ్చయోపదేశము
  • దశకుశలకర్మోపదేశం
  • కర్మభిభంగ
  • సమాధిసంభవపరివర్త
  • లోకోత్తరసప్తకావిధి
  • గుహ్యక్రియాకర్మ
  • చిత్తోత్పాదసంబరావిధికర్మ
  • శిక్షాసముచ్చాయ అభిసమాయ
  • విమలరత్నలేఖన : నేపాల్ నుండి అతిశా నాటి మగధ రాజు నయపాలకు రాసిన సంస్కృత లేఖ.

"బోధిపథప్రదీప" అనేది అతిశా రచనలలో ముఖ్యమైనది. థోలింగ్ విహారంలో వున్నప్పుడు రచించబడింది. ఇది బుద్ధుని బోధనల సారాంశంతో కూడిన చిన్న పుస్తకం. ఉన్నత నైతిక జీవితం, వినయం, స్వచ్ఛత, సార్వత్రిక ప్రేమ, అహింస, స్నేహం, జ్ఞానోదయం, కరుణకు మార్గం బోధిచిత్తం. ఈ బోధిచిత్త సాధించడానికి ధ్యానం అవసరం. కేవలం అరవై ఆరు శ్లోకాలతో కూడిన ఈ చిన్న పుస్తకం బౌద్ధమత ప్రాథమిక సూత్రాలను సరళమైన, స్పష్టమైన భాషలో తెలియజేసింది. దీని ద్వారా అతిశా బుద్ధుని సిద్ధాంతాలకు అనుగుణంగా టిబెట్ ప్రజలలో నైతికతను పెంపొందింప చేయడంలో విజయం సాధించాడు.

"విమలరత్నలేఖన" అనేది అతిశా నేపాల్ నుండి నాటి మగధ రాజు నయపాలకు రాసిన సంస్కృత లేఖ. దీనిలో పేర్కొన్న అంశాలను బట్టి, రాజుకు చేసిన సందేశంలో క్లాసిక్‌గా పరిగణించబడుతుంది.[8] ఇది ఒక రాజుగ నిర్వర్తించాల్సిన విషయాలైన సర్వ జీవుల పట్ల కరుణ కలిగివుండటం, ఆలోచనలలోను, చేసే కార్యాలలోను చెడును త్యజించడం, వినయ ప్రవర్తనలను పేర్కొన్న ఒక బౌద్ధ సందేశం. రాజుగా అందరి పట్ల దయ, ప్రేమ చూపడం, మనో చిత్తాన్ని సాధించడం, అనవసర బలాన్ని త్యజించడం మొదలైనవి పేర్కొంటున్నది. శాంతి, సామరస్యాలతో కూడిన ఈ సార్వజనిక బౌద్ధ సందేశం, సమకాలీన ప్రపంచ పరిస్థితులలో కూడా చాలా సందర్భోచితమైనది. దీని యొక్క టిబెట్ అనువాదం ఇప్పటికీ టిబెట్ లోని తంజ్యుర్ (Tengyur) లో భద్రంగా పదిలపరచబడింది.

మరణం

[మార్చు]

చివరగా అతిశా క్రీ.శ.1053 లో లాసాకి సమీపంలో నైరుతిలో వున్న నైతాంగ్ (Nyethang) ను చేరుకొన్నాడు. టిబెట్ లో బౌద్ధమతాన్ని సంస్కరించడానికి, వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా కఠినమైన టిబెట్ పీఠభూమిలో ఎడారుల గుండా, కొండ ప్రాంతాల్లో, అతి దుర్భర శీతల వాతావరణ పరిస్థితులలో నిర్విరామంగా ప్రయాణాలు చెయడంతో అప్పటికే అతని ఆరోగ్యం క్షీణించింది. చివరకు టిబెట్‌లో క్రీ.శ.1041 నుండి 13 సంవత్సరాల నిరంతర ధర్మ ప్రబోధం అనంతరం, క్రీ.శ.1054లో అతిశా తన 72వ ఏట నైతాంగ్ లోని డ్రోల్మా (Nyethang Drolma) బౌద్ధ ఆలయం లోని తారామందిరంలో మరణించాడు. నైతాంగ్ లో ఖననం చేశారు. అతని చివరి మాటలు “డ్రోమ్-తోన్ ను నా ఆధ్యాత్మిక వారసునిగా వదిలి వెళుతున్నాను. నాపట్ల వున్నట్లే అతనిపట్ల గౌరవం కలిగి వుండండి. ప్రాపంచిక వ్యవహారాలలో దృష్టి మరల్చకండి. నా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.[13] ఇప్పటికీ టిబెట్ లోని నైతాంగ్ డ్రోల్మా ఆలయ విహారంలో అతిశా ఉపయోగించిన భిక్షాపాత్ర, కమండలం, ఖదిరదండం, రాజముద్రలాంచితం సురక్షితంగా భద్రపరచబడివున్నాయి. ఈ ఆలయంలో ప్రధాన విగ్రహం అయిన గౌతమ బుద్ధుని చెంత ఎడమవైపున అతిశా చిన్న విగ్రహం నెలకొల్పారు.[14] ఆ తరువాత 1057 లో అతని ప్రియ శిష్యుడు డోమ్-తోన్ అతిశా వుపయోగించిన జ్ఞాపక వస్తువులలో కొన్నింటిని నైతాంగ్ నుండి రెటింగ్ బౌద్ధ మఠానికి తీసుకువచ్చాడు. అక్కడ అతని అవశేషాలను ఒక భారతీయ కళాకారుడు నిర్మించిన స్థూపంలో భద్రపరచడం జరిగింది.[15]

వారసత్వం

[మార్చు]
టిబెటన్ బౌద్ధ శాఖల వంశవృక్షం-కదమ్/గెలుగ్ శాఖ పసుపు రంగులో చూపబడింది.

అతిశా ముఖ్యమైన వారసత్వాలలో మొదటిది లోజోంగ్ (Lojong). మనస్సు యొక్క శిక్షణ (Mind Training) అనేది టిబెటన్ బౌద్ధ సంప్రదాయంలో ఒక ఆలోచనాత్మక అభ్యాసం. లోజోంగ్ లో మనో శిక్షణ కోసం అభివృద్ధి చేసిన పద్ధతులు, సూత్రాలను ఉపయోగిస్తారు. టిబెట్‌ మహాయాన సంప్రదాయంలోని బోధిచిత్త భావనకు ప్రాధాన్యత అతిశా తోనే ప్రారంభమైంది. టిబెట్ లో అదివరకెన్నడూ లేని బోధిచిత్తాన్ని అభ్యసించే విధానాల వృద్ధికి అతిశా మూలకారకుడయ్యాడు. మనోదృష్టిని ఏకాగ్రత వైపుగా కేంద్రీకరించే విధానం అతని బోధనలతోనే ప్రారంభమై, టిబెట్ బౌద్ధంలో అంతర్భాగంగా మారింది. ఇది క్రమేణా గెలుగ్ (Gelug), నింగ్మా (Nyingma), కాగ్యు (Kagyu), శాక్య (Sakya) అనే నాలుగు ధర్మ సంప్రదాయాలలోను భాగమైంది. ఈ కారణంగా, బౌద్ధమత చరిత్రలో అతిశా ఒక కీలక వ్యక్తి అయ్యాడు.

రెండవది, కదమ్ (Kadamp) శాఖ ఆవిర్భావం. అతిశా బోధనల నుండే టిబెట్ బౌద్ధంలో కదమ్ శాఖకు పునాదులు పడ్డాయి. ముఖ్యంగా అతను రచించిన ప్రసిద్ధ గ్రంథం బోధిపథ-ప్రదీపను ఆధారంగా చేసుకొని, అతని సన్నిహిత శిష్యుడు, డ్రోమ్‌-తాన్ (Dromtönpa) ఈ మత సంఘం స్థాపకుడయ్యాడు.[16] కదమ్ సంప్రదాయంలో వ్యక్తిగత విముక్తి ప్రమాణాలు, బోధిసత్వ ప్రమాణాలు, తాంత్రిక ప్రమాణాలు-అనే మూడు ప్రమాణాలు ఒకదానితో ఒకటి సామరస్యంగా ఉంటాయి. ఈ శాఖే తరువాతి కాలంలో టిబెటన్ బౌద్ధమతం యొక్క నాలుగు ప్రధాన శాఖలలో ఒకటైన గెలుగ్‌ శాఖ (పసుపు విభాగం) గా పరిణామం చెందింది. సన్యాసం, లోజోంగ్ బోధనలకు ముఖ్య కేంద్రంగా ఎదిగిన కదమ్/గెలుగ్ శాఖ మరోపక్క నింగ్మా, కగ్యు, శాక్య అనే మూడు శాఖలను కూడా చేర్చుకొంటూ కదమ్/గెలుగ్ శాఖ బాగా ప్రసిద్ధిపొందింది. ఈ గెలుగ్‌ శాఖ కాలక్రమేణా సోవియట్ యూనియన్‌లోని టిబెట్, చైనా, మంగోలియా, సైబీరియన్ ప్రాంతాలలో ఆధిపత్య బౌద్ధ మతంగా మారింది. అతిశా బోధనలపై ఆధారపడిన ఈ గెలుగ్ శాఖ యొక్క మతపరమైన ఆదర్శాలే చివరకు 14వ శతాబ్దం నుండి టిబెట్‌లో ప్రబలంగా ఉన్న దలైలామా యొక్క ఆధ్యాత్మిక సంస్థ ఏర్పాటుకు కూడా దారితీశాయి. టిబెట్ లో మతపాలనాధికారాలను కలిగివున్న టిబెట్ లామాలు దీపాంకర్ శిష్యులుగా, వారసులుగా వున్నారు

టిబెట్‌లోని అవినీతి పద్ధతులను సంస్కరించడానికి, క్షీణిస్తున్న బౌద్ధమతాన్ని సంస్కరించడానికి అతిశా బుద్ధుని జన్మస్థలమైన భారతదేశంలో తన ప్రభావాన్ని (influence) సమీకరించాడు. అతిశ టిబెట్‌లో కాలచక్ర తంత్ర సంస్కృతిని ప్రవేశపెట్టాడు. టిబెటన్ కాలక్రమంలో, ఈ చక్రం ప్రతీ 60 సంవత్సరాలకు పునరావృతమవుతుంది. దీని మొదటి చక్రం యొక్క మొదటి సంవత్సరం 1027 తో ప్రారంభమవుతుంది.

టిబెట్ (ప్రస్తుత చైనా) బౌద్ధాన్ని అత్యంత ప్రభావితం చేసిన అతిశా, జన్మస్థలం బంగ్లాదేశ్‌లోని విక్రమ్‌పూర్‌ కావడంతో, ఇటీవల చైనా-బంగ్లాదేశ్ దేశాల మధ్య మధ్య సాంస్కృతిక మార్పిడికి, సంప్రదాయ స్నేహ బంధాలు బలోపేతం కావడానికి అతిశా ఒక చిహ్నంగా మారారు.[17] చైనా 1978 లో బంగ్లాదేశ్‌కు అతిశా చితాభస్మంలో కొంత భాగాన్ని ఇచ్చింది. [18] ఆ చితాభస్మాన్ని ఢాకా (బంగ్లాదేశ్) లోని ధర్మారాజిక బౌద్ధ దేవాలయంలో భద్రపరిచారు. బంగ్లాదేశ్ బౌద్ధ ప్రచార సంఘ సహకారంతో చైనా ప్రజలు విక్రమ్‌పూర్‌ గ్రామంలో అతని జ్ఞాపకార్థం ఒక సమాధి (mausoleum) ని నిర్మించారు. బంగ్లాదేశ్ లో అతిశా దీపాంకర్ స్మారకార్థం అనేక సంస్థలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. వాటిలో ముఖ్యమైనవి. 2004 లో స్థాపించిన అతిష్ దీపాంకర్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, [17] ది అతిష్ దీపాంకర్ గబేశన పరిషత్ (ది అతిష్ దీపాంకర్ రీసెర్చ్ సెంటర్). అతని స్మారకార్థం ప్రతి ఏడాది సమాజంలోని వివిధ రంగాలలో గొప్ప కృషి చేసినవారికి అతిష్ దీపాంకర్ బంగారు పతకాన్ని ప్రదానం చేస్తారు. అదేవిధంగా ప్రతి ఏడాది అతిశా దీపాంకర్ శాంతి గోల్డెన్ అవార్డును బంగ్లాదేశ్ బౌద్ధ క్రిస్టి ప్రచార సంఘం, మతం-శాంతి రంగంలో విశిష్ట సేవలందించినవారికి ప్రదానం చేస్తారు.[17]

బౌద్ధధర్మంలో అతిశా స్థానం-అంచనా

[మార్చు]

అతిశా జన్మించిన భూమిలో బౌద్ధమతం క్షీణించినందున, శతాబ్దాలుగా అతిశాను కూడా భారతదేశం పూర్తిగా మరచిపోయింది. దాదాపు 900 సంవత్సరాల తర్వాత, 19వ శతాబ్దం చివరలో, తంజూరు లిఖిత ఆధారాలలో అతని కృషి బయటపడినపుడు, అతని విశిష్టత ప్రపంచానికి తెలిసింది.

11వ శతాబ్దపు ఆసియాలో మహాయాన, వజ్రయాన బౌద్ధమత వ్యాప్తికి దోహదపడిన అతి ప్రధాన వ్యక్తులలో అతిశా ఒకరు. అతను సుమిత్రా నుండి టిబెట్ వరకు బౌద్ధ చింతనను ప్రేరేపించాడు. 11వ శతాబ్దంలో ముఖ్యంగా టిబెట్ లో బౌద్ధమతాన్ని సంస్కరించడంలో అతను చేసిన అవిరళ కృషి సాటిలేనిది. నైతికత, ఆదర్శవాద స్ఫూర్తి లను ప్రజల్లో గాఢంగా నింపినపుడు, ప్రజలలో నిబిడీకృతమైన సృజనాత్మకతలను వెలికి తీసినపుడు, ఆ ప్రజల మత, సాంస్కృతిక జీవితాలు ఎలా విప్లవాత్మకంగా మారతాయో అనేది టిబెట్ లో అతిశా చేపట్టిన ధార్మిక కార్యక్రమం విజయవంతంగా నిరూపించింది.

అతిశా దీపాంకరను 'ఆసియా నేత్రం' (Eye of Asia) గా అభివర్ణించారు. యుగాలుగా శాంతి, కరుణ, జ్ఞానం కోసం పరితపిస్తున్న మానవజాతి యొక్క మహోన్నత వారసత్వానికి అతను కాంతి చిహ్నంగా నిలిచాడు. భారతదేశం, టిబెట్‌లో అతని విశేషమైన కృషిని చారిత్రక మూల్యాంకనం చేసిన, నిహార్ రంజన్ రాయ్ తన 'హిస్టరీ ఆఫ్ ది బ్యాంగిల్స్' గ్రంథంలో " అతిశా దీపంకర తన అపారమైన పాండిత్యం, ఆధ్యాత్మికతల కారణంగా బెంగాల్, భారతదేశంలో ఉద్భవించిన తేజో మూర్తులలో ఒకరుగా నిలిచారు. తూర్పు భారతదేశం, టిబెట్ మధ్య సౌభ్రాతృత్వ వారధిని నెలకొల్పిన వారిలో, దీపంకర అతిశా పేరు మొదటిదిగానే కాక ప్రధానమైనదిగా పేర్కొనడానికి అర్హమైనది. నాటి సమకాలీన పరిస్థితులను చూసి, "దీపంకర్ లేని భారతదేశం చీకటిలో మునిగిపోతుంది.". అని పేర్కొన్న ఆచార్య రత్నాకర మాటలో అతిశయోక్తి లేదు. గాఢమైన తిమిరాంధకారంలో దీపంకరుడు మాత్రమే ఆశాకిరణం." అని పేర్కొన్నాడు. 11 వ శతాబ్దంలో మధ్య ఆసియాలో తన ధార్మిక బోధనలతో, ధార్మిక పద భ్రష్టత అనే అంధకారంలో మునిగిపోయిన టిబెటియన్లకు కూడా ఆశాకిరణమయ్యాడు. సరైన సమయంలో టిబెట్ సమాజానికి మార్గదర్శిగా (Torchbearer) నిలిచి అక్కడి బౌద్ధ మత పునర్జీవనంలో అద్వితీయమైన పాత్ర వహించాడు. అతని మహోన్నతమైన వ్యక్తిత్వం , ఆకట్టుకునే బోధనల కారణంగా, బౌద్ధమతం 11వ శతాబ్దంలో సెంట్రల్ టిబెట్ అంతటా పునరుజ్జీవనం పొందింది.

అతిశా యొక్క బోధనలు ప్రాచీన భారతదేశానికి టిబెట్, చైనా తదితర ఉత్తర ఆసియా దేశాలతో మత, సాంస్కృతిక సంబంధాలను అందించాయి. దీపంకర టిబెట్ సందర్శన గురించి, ఒక పండితుడు ఇలా పేర్కొన్నాడు "క్రీస్తుశకం 11వ శతాబ్దంలో, అతిశా తన భారతదేశంలో కోల్పోయిన ఆధ్యాత్మిక స్ఫూర్తిని టిబెట్ కు తీసుకొని వచ్చాడని చెప్పవచ్చు. దీని ఫలితంగా బౌద్ధమతం టిబెటన్ నేలలో లోతుగా వేళ్లూనుకుంది. అక్కడ నుంచి అది మతపరంగాను, తాత్విక ఆలోచనపరంగాను దేశీయ రీతిగా వికాసం చెందింది." ఆపై బౌద్ధమతం, టిబెట్ జాతీయ మతంగా మారింది.

టిబెట్ తోపాటు ఉత్తర ఆసియా దేశాలలో అతిశా రెండవ బుద్ధుని స్థాయికి చేరుకొన్నాడు. బోధిసత్వ అవతారంగా అతని చిత్రపటాన్ని అక్కడి ప్రార్థనా స్థలాలలో పూజిస్తారు. ఒక పాశ్చాత్య పండితుడు 'టిబెట్లోని బౌద్ధమతం (Buddhism in Tibet) గ్రంథంలో పేర్కొన్నట్లు, అతిశాను టిబెట్‌ను సందర్శించిన మహా జ్ఞాని అని చెప్పడానికి, అతనిని టిబెట్ లో జ్ఞాన స్వరూపుడైన బోధిసత్వ మంజుశ్రీ యొక్క అవతారంగా కొలవడమే ఒక నిదర్శనం.

గ్రంథ సూచిక

[మార్చు]
  • Indian Pandits of the Land of snows by Sarat Chandra Das, Calcutta, 1965.
  • A short Biography of the Ven. Atisa, China Buddhist Association, 1978.
  • Dipankara Alias Atisa by Alaka Chattapaddayaya
  • Atisa at Vikramsila by Nag-tsha tsul-khrinsr Gyal-ba transl. by Sarat Chandra Das
  • Banglar Itihasa-Nihar Ranjan Roy

బయట లింకులు

[మార్చు]
  • Atisha Dipankar Srijnan: Eye of Asia by Deba Priya Barua
  • [1] Atiśa Dipamkara on Banglapedia
  • B.D, Dipananda. "The Birthplace of Atish Dipankar Comes to Light". Buddhistdoor Global. Archived from the original on 2022-10-16. Retrieved 2022-10-16.

మూలాలు

[మార్చు]
  1. "Portrait of Atiśa [Tibet (a Kadampa monastery)] (1993.479)". Timeline of Art History. New York: The Metropolitan Museum of Art, 2000–. October 2006. Retrieved 11 January 2008.
  2. "Listeners name 'greatest Bengali'" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 14 April 2004. Retrieved 24 February 2018.
  3. "International : Mujib, Tagore, Bose among 'greatest Bengalis of all time'". The Hindu. 2004-04-17. Archived from the original on 25 December 2018. Retrieved 24 February 2018.
  4. "The Daily Star Web Edition Vol. 4 Num 313". The Daily Star. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 24 February 2018.
  5. "Janata Bank Journal of Money, Finance and Development" (PDF). Janata Bank. p. 54. Archived from the original (PDF) on 9 డిసెంబరు 2020. Retrieved 18 November 2020.
  6. Atisa and Tibet: Life and Works of Dipamkara Srijnana by Alaka Chattopadhyaya p.91
  7. "Ratnākaraśānti". Encyclopedia of Buddhism Online.
  8. 8.00 8.01 8.02 8.03 8.04 8.05 8.06 8.07 8.08 8.09 8.10 Deba Priya Barua & Atisha Dipankar Srijnan: Eye of Asia.
  9. "Dromton Gyelwa Jungne". The Treasury of Lives (in ఇంగ్లీష్). Retrieved 11 December 2018.
  10. Tulku & Helm 2006, p. 74.
  11. Rizvi (1996), pp. 59-60
  12. Kanak Baran Barua & Journal of Religious Studies, Buddhism and Living Atish Dipankar Srijnan-Unsurpassable Luminaries of Asia 2016.
  13. Barua, Kanak Baran (Feb 2016). "Journal of Religious Studies, Buddhism and Living Atish Dipankar Srijnan-Unsurpassable Luminaries of Asia". Research Gate.
  14. Buckley 2012, p. 178.
  15. Kossak & Bruce-Gardner 1998, p. 59.
  16. POV. "Tibetan Buddhism from A to Z - My Reincarnation - POV - PBS". PBS. Archived from the original on 2015-09-24. Retrieved 2022-10-16.
  17. 17.0 17.1 17.2 B.D Depananda 2015.
  18. B.D, Dipananda. "The Birthplace of Atish Dipankar Comes to Light". Buddhistdoor Global. Archived from the original on 2016-05-31. Retrieved 2015-02-27.
"https://te.wikipedia.org/w/index.php?title=అతిశా&oldid=4334157" నుండి వెలికితీశారు