Jump to content

నారదుడు

వికీపీడియా నుండి
వీణ సృష్టికర్త అయిన నారదుడు.

నారదుడు (సంస్కృతం: नारद, nārada) లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కథలు బహుళంగా వస్తాయి.

ఎన్నో పురాణాలలో నారదుని పాత్ర కనుపిస్తుంది. అందులో ముఖ్యమైనవి -

నారదుని పూర్వ జన్మ వృత్తాంతం

[మార్చు]

మహాభాగవతం మొదటి స్కంధంలో నారదుడు తన గాథను స్వయంగా వేద వ్యాసునికి తెలిపాడు. తాను పూర్వ జన్మ పుణ్య కారణంగా హరికథా గానం చేస్తూ ముల్లోకాలలో సంచరింప గలుగుతున్నానని చెప్పాడు.

పూర్వ కల్పంలో నారదుడు వేదవిదులైన వారింట పని చేసే ఒక దాసికి కుమారుడు. ఒకమారు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా పరిచర్యలు చేశాడు. వారు సంతోషించి ఆ బాలునికి విష్ణుతత్వం ఉపదేశించారు. వారి దయవలన ఆ బాలుడు వాసుదేవుని అమేయ మాయాభావాన్ని తెలుసుకొన్నాడు. ప్రణవంతో కలిపి వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ మూర్తులను స్మరించి నమస్కరించినట్లయితే సమ్యగ్దర్శనుడౌతాని గ్రహించాడు.

అతని తల్లి ఒకనాడు పాము కాటువల్ల మరణించింది. అప్పుడు నారదుడు అన్ని బంధములనుండి విముక్తుడై అడవికి పోయి భగవత్స్వరూపాన్ని ధ్యానించ సాగాడు. ఏకాగ్ర ధ్యాన సమయంలో అతని మనస్సులో భగవత్స్వరూపం గోచరించింది. కాని మరుక్షణమే అంతర్ధానమైంది. చింతాక్రాంతుడై నారదుడు అడవిలో తిరుగుతుండగా అతనికి దివ్యవాణి ఇలా ఆదేశమిచ్చింది - ఈ జన్మలో నీవు నన్ను పొందలలేవు. కాని నా దర్శనం వల్ల నీ సందేహాలు తొలగి అచంచలమైన భక్తి చేకూరింది. ఈ శరీరం త్యజించిన పిమ్మట నా పార్షదుడవై నన్ను పొంద గలవు. - నారదుడు సంతుష్టుడై నిరంతరం హరి నామ జపం చేస్తూ కాలం గడిపి, అంతిమ సమయం ఆసన్నమైనపుడు తన దేహాన్ని త్యజించాడు.

అనంతరం ప్రళయ కాలం సమీపించగా ఒక సముద్రంలా ఉన్న ఆ జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మ శ్వాసలో ప్రవేశీంచి ఆయనలో లీనమయ్యాడు. వేయి యుగాల కాలం తరువాత బ్రహ్మ లేచి లోకాలను సృష్టించడం ఆరంభించినపుడు బ్రహ్మ ప్రాణములనుండి మరీచి మొదలైన మునులతోబాటు నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుని బ్రహ్మ మానస పుత్రుడయ్యాడు. అలా నారదుడు అఖండ దీక్షాపరుడై విష్ణువు అనుగ్రహం వలన నిరాటంకంగా సంచరించగలుగుతుంటాడు. తాను స్మరించగానే నారాయణుని రూపం అతని మనసులో సాక్షాత్కరిస్తుంది.

ఇలా తన కథ చెప్పి హరికథా గానంతో నిండి వున్న భాగవతాన్ని రచించమని నారదుడు వేద వ్యాసునికి ఉపదేశించాడు.

మహాభారతంలో వర్ణన

[మార్చు]

మహా భారతం సభాపర్వంలో నారదుని గురించి ఇలా చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు. కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు. ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు. సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు.[1]

నారదుడి గొప్పతనం

[మార్చు]

ఏ జాతి అయినా దానియొక్క మహనీయులను ఆ జాతికి సాంస్కృతిక ధార్మికభిక్ష పెట్టిన మహానుభావులను విస్మరించి ఎగతాళి చేస్తే అది ఆ జాతికి మహాదోషమూ పాపమూ అవుతుంది.ఆ పాపఫలితాలు చాలా సూక్ష్మంగానూ తరతరాల పాటు వెంటాడేవి గానూ ఉంటాయి.మనం కూడా తెలిసో తెలియకో చేస్తున్న అటువంటి పాపం ఒకటి ఉన్నది - అదే దేవర్షియగు నారదముని నింద. నారదమహర్షి మామూలు ఋషి కాదు.ఆయన దేవఋషి. మానవ ఋషులే వారి శాపానుగ్రహ శక్తితో మనిషి తలరాతను మార్చగల సమర్ధులు.ఇక దేవఋషి అయిన నారదుని మహత్యము చెప్పలేము.ఆయన యొక్క మహత్వమును మన జాతి సరిగా గ్రహించలేదని నా ప్రగాఢమైన నమ్మకము.ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మన జాతికి భిక్ష పెట్టిన ఇద్దరు మహామహితాత్ములున్నారు.ఒకరు శ్రీమద్రామాయణ కృతికర్త యగు వాల్మీకిమహర్షి.వేరొకరు శ్రీమద్భాగవతమును రచించిన వేదవ్యాసమహర్షి. మన భారతజాతికి వీరే పరమగురువులు.ఒకరు ధర్మ స్వరూపుడైన భగవంతుని చరితమును రామాయణముగా అక్షరబద్ధం గావిస్తే,ఇంకొకరు లీలామానుష విగ్రహుడైన శ్యామసుందరుని కథను భాగవతముగా మనకు అందించారు.ఈ రెండు గ్రంధములున్నంత వరకూ భారత జాతీ,మతమూ సంస్కృతులు నిలిచి ఉంటాయి.కనుక వీరే మనకు పరమ గురువులు. ఈ పరమ గురువులకు కూడా ఉపదేశమొనర్చి వారు సంకటస్తితిలో ఉన్నప్పుడు మార్గాన్ని చూపి తద్వారా భారతజాతికి ఈ రెండు అమూల్యములైన గ్రంధములను ప్రసాదించిన పరమగురువు నారదమహర్షి. కనుక మనము పొద్దున్న లేవగానే మొదట స్మరించవలసినది గురువులకే గురువైన నారదమహర్షిని మాత్రమె.ఆ నారదుని దివ్యస్తితి ఎట్టిది? ఆయనకు మనవలె లౌకికవాంచలు జంజాటములు లేవు.నిరంతరమూ నారాయణుని దివ్యనామాన్ని గానం చేస్తూ ఆయన రూపాన్ని ధ్యానం చేస్తూ మూడు లోకాలలోనూ ఎక్కడా అడ్డు లేకుండా సంచరించగల పరమభక్తుడు నారదరుషి.పరమానంద ధామమైన వైకుంఠమునకు కూడా తలచినప్పుడు పోగల శక్తి సంపన్నుడు.సాక్షాత్తు భగవంతుని వద్ద అంతటి చనవు ఉన్నట్టి ప్రేమభక్తి తత్పరుడు. రామ మంత్రమును తిరుగదిప్పి మూర్ఖుడైన అడివి మనిషికి ఉపదేశం ఇచ్చి వానిని వాల్మీకి మహర్షిగా పరివర్తన చెందించిన సిద్ధసంకల్పుడు నారదమహర్షి.పురాణ ఉపపురాణాదులను రచించినప్పటికీ ఏదో తీరని వేదనతో బాధపడుతున్న వ్యాసమునీంద్రునికి దర్శనం ఇచ్చి ఆయనను ఊరడించి,ఉపాయమును ఉపదేశించి, అమృతోపమానమైన భాగవత సుధను వ్యాసుని ముఖతః లోకానికి ప్రసాదించిన మధుర భక్తాగ్రేసరుడు నారదమౌని.దర్శనమాత్రం చేత సమస్త బాధలనూ పోగొట్టి మానవ హృదయానికి అమితమైన శాంతిని చేకూర్చగల దివ్యరూపుడు నారద మహర్షి.సంగీతశాస్త్రమున ఆయనను మించిన జ్ఞానులు గాని ఆయనను మించిన మధుర గాయకులు గాని ముల్లోకాలలో ఎవ్వరూ లేరు. అటువంటి దేవర్షికి మనం ఇస్తున్న మర్యాద ఏమిటో ఒకసారి చూద్దాం. మన నాటకాలలో కథలలో సినిమాలలో ఆయనను ఒక జోకర్ గా, తగాదాలు పెట్టె తంపులమారిగా,ఒక వెకిలి మనిషిగా చిత్రీకరిస్తూ ఘోరమైన పాపాన్ని మనం మూటగట్టుకుంటున్నాం.కలహభోజనుడు,మాయలమారి మొదలైన బిరుదులిచ్చి ఆయన్ను అపహాస్యం చేశారు మిడిమిడి జ్ఞాన సంపన్నులైన మన రంగస్థల చలనచిత్ర మూర్ఖ శిఖామణులు.మన ధర్మానికి పరమ గురువైన నారదమహర్షికి,మనం ఇస్తున్న విలువ ఇది. ప్రాతస్మరణీయుడైన ఒక మహాయోగికి మనం ఇస్తున్న మర్యాద ఇది.ఎదో రకంగా డబ్బు సంపాదించడం తప్ప జీవితంలో ఇంకే ఉన్నతాదర్శమూ లేని మనలాంటి ఆత్మాభిమానహీన జాతికి ఇంతకంటే ఇంకేమి చేతనవుతుంది? కనుకనే మన దౌర్భాగ్యం ఇలా తగలడింది.

మన తల్లినీ తండ్రినీ ఎవరైనా ఎగతాళి చేస్తే,నిందిస్తే మనకు ఎంతటి కోపం వస్తుంది? ఒకవేళ మనమే వారిని నిందిస్తే అదెంత తప్పు? అలాంటప్పుడు ఈ జాతికి ధార్మికభిక్ష పెట్టిన ఒక మహర్షిని మనం ఎంతగా గౌరవించాలి? అది చెయ్యడంపోయి,ఆయన్ను ఒక వెకిలిమనిషిగా చిత్రీకరిస్తూ,హీనమైన బిరుదులిచ్చి ఆనందిస్తూ,మనం ఎంత మహాపరాధం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి.ఈ పాపానికి కారణం మన సినిమాలూ,వాటిని నిర్మిస్తున్న క్షుద్రజీవులే.


నారద మౌని త్రిలోక సంచారి. త్రిలోక గురువు. ఆయన సాక్షాత్తు భగవంతుని ప్రతినిధి.పరమ కరుణామూర్తి.దీనులకు,దారితప్పిన సాధకులకు దిక్కుతోచని ఆర్తులకు ఆయన పెన్నిధి.అటువంటి ఆర్తులకు ఎందరికో ఆయన కనిపించి కనికరించి వారికి భగవత్సాక్షాత్కారము కలిగే మార్గమును ఉపదేశించినట్లు అనేక నిదర్శనములు కలవు.ఈనాటికీ ధన్యాత్ములైన సాధకులకు ఆయన దర్శనము సులభసాధ్యమే. అది భక్తుల యెడ ఆయనకున్నట్టి అపార వాత్సల్యమే గాని మన గొప్పగాదు. భగవంతుని దర్శనము అతి కష్టము.కాని నారదమునీన్ద్రుని దర్శనము సులభసాధ్యము.కర్మ పరిపాకమున గాని నారాయణుడు కరుణించడు.కాని మహర్షి అటులగాదు.ప్రేమతో భక్తులకు కనిపించి వారికి కర్మక్షాళణా ఉపాయమును బోధించుటలో ఆయన ఆసక్తుడు.హృదయపూర్వకమైన ఆర్తితో ఆయనను పిలచినచో చాలు.ఆయన నిత్యముక్తుడు.ఆయనకు ముల్లోకములలో చెయ్యవలసిన కర్మ లేనేలేదు.నిత్య స్వతంత్రుడు.కనుక ఆర్తితో అలమటిస్తున్న జీవులకు దారిచూపడమే ఆయనకు మిగిలిన కర్తవ్యము.నిరంతర నారాయణ నామస్మరణారతుడై ఆనందానుభూతిలో తేలుతూ ఉండటము,నిజమైన సాధకులకు మార్గనిర్దేశనం చేయడం - ఈ రెండే ఆయన పనులు.గురువులకే గురువు నారద మహర్షి. నారదుడు అనే పదమే గొప్ప అర్ధాన్ని కలిగి ఉన్నది. 'నార' అనే సంస్కృత పదానికి ఉన్న అనేకానేక అర్ధములలో 'జ్ఞానము' అనేది కూడా ఒకటి.నారదుడు అనగా 'జ్ఞానమును ప్రసాదించగలవాడు' అని అర్ధం.నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు.మహిమాన్వితుడైనట్టి ప్రాతఃస్మరణీయుడు. నారదుడు అనే పదమే గొప్ప అర్ధాన్ని కలిగి ఉన్నది. 'నార' అనే సంస్కృత పదానికి ఉన్న అనేకానేక అర్ధములలో 'జ్ఞానము' అనేది కూడా ఒకటి.నారదుడు అనగా 'జ్ఞానమును ప్రసాదించగలవాడు' అని అర్ధం.నారద మహర్షి అట్టి శక్తి సంపన్నుడు.మహిమాన్వితుడైనట్టి ప్రాతఃస్మరణీయుడు.

మన వేదములు ఆగమములు పురాణములు ఇతిహాసములలో నారదమహర్షి పాత్ర బహుముఖములుగా ఉన్నది.ఈ కీర్తనలో మహర్షిని త్యాగయ్య 'నాద సరసీరుహ భ్రుంగ' అని గొప్పగా భావిస్తాడు.అంటే 'నాదమనే పద్మములో నిరంతరమూ అమృతాన్ని ఆస్వాదిస్తున్న తుమ్మెద' వంటి వాడని భావం.ఇది నాదోపాసనలో మత్తిల్లిన చిత్తానికి సంకేతం.మహత్తరమైన యోగసిద్దికి తార్కాణం.'శుభాంగా' అన్న సంబోధనలో నారద మహర్షి యొక్క స్పటికనిభ సంకాశమైన శుభంకరమైన వర్చస్సు గోచరిస్తున్నది. ఆయన శరీరము భౌతికమైనట్టిది కాదు. భౌతికమే అయితే త్రిలోకములలో సంచరించలేదు.భౌతిక శరీరము ఈ భూమి వరకే ఉపయోగపడుతుంది.కాని మహర్షి త్రిలోక సంచారి.ఆయనది చిదాకాశము వంటి దివ్యదేహము గనుక ధ్యానించు వారికి శుభప్రదమైనది. 'భేశ సంకాశ' అన్న పదం అద్భుతమైనది.భేశ అనగా నక్షత్రములకు ఈశుడు అనగా చంద్రుడు కనుక చంద్రకాంతి వంటి చల్లని తెల్లని వన్నె కల్గినది మహర్షి దేహచ్చాయ.ఆయన దర్శనం దీనులను కాపాడునట్టిది.ధ్రువ ప్రహ్లాదాది పరమ భక్తులకు,వ్యాసవాల్మీకాది మహర్షులకు సంకట సమయంలో కరుణించి దారిచూపినట్టి పరమ గురువరేణ్యుడు నారద మునీంద్రుడు. ఆయన 'వేదజనిత వరవీణా వాదన తత్వజ్ఞుడు'- వేదములలో ఉద్భవించిన వీణావాదన రహస్యములను ఎరిగినవాడు.వీణానాదమును అంతరిక సాధనలో మేరుదండమనబడిన వెన్నెముకలో గల సప్త చక్రములలో మ్రోగించుచు బ్రహ్మానంద రసాస్వాదన చేయగల విద్య మహాయోగులకు విదితమే.అట్టి విద్యకు నారదుడు పరమ గురువు. ఆయన యాదవ కులజాప్తుడు.శ్రీకృష్ణునికి ఆయన పరమ సన్నిహితుడు.కృష్ణుని లీలా నాటకమున ముఖ్య పాత్రధారి నారదుడు.సదా సరసమయమైన సంతోషహృదయుడు నారదుడు.ఆయనలో విచారమన్నది లేనేలేదు.ఆయన ఆకలి,దప్పిక,ముసలితనము,మరణాలకు అతీతుడు. నిర్వికారుడై చిరునవ్వుతో సృష్టిలీలను ఆలోకిస్తూ ఉండే చిరజీవి.సమస్త లోకాలనూ భగవద్విభూతిగా ఆలోకించుచూ నిరంతర భగవన్నామ స్మరణతో యధేచ్చగా సంచరించుచూ ఉన్నట్టి పరమపావనుడా ముని వర్యుడు.ఆయన శ్రీకరుడు,అనగా దర్శనమాత్రం చేత శుభాన్ని కలిగించ గలవాడు.మహామహిమాన్వితుడు.త్రితాప రహితుడు.దేవతలచేత కూడా నిత్యమూ కీర్తించబడే దివ్యరూపుడు. సాక్షాత్తు పరమాత్మునికి అత్యంత సన్నిహితుడు

మూలాలు, వనరులు

[మార్చు]
  1. శ్రీ మద్భగవద్గీత - తత్వ వివేచనీ వ్యాఖ్య - జయదయాల్ గోయంగ్‌కా వ్యాఖ్యానం (గీతా ప్రెస్, గోరఖ్‌పూర్ ప్రచురణ)
  • శ్రీమన్మహాభాగవతము - డా.జోస్యుల సూర్య ప్రకాశరావు - ప్రచురణ :గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి
  • సత్యనారాయణశర్మ రూపెనగుంట్ల

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నారదుడు&oldid=3956153" నుండి వెలికితీశారు